యువ‌త పోరుకు వైసీపీ స‌మాయ‌త్తం

మ‌రో ప్ర‌జా పోరాటానికి వైసీపీ స‌మాయ‌త్తం అవుతోంది. ఈ నెల 4న వెన్నుపోటు దినాన్ని వైసీపీ విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. వెన్నుపోటు దినానికి వెల్లువెత్తిన పార్టీ శ్రేణుల్ని చూసి వైసీపీ నాయ‌కులే ఆశ్చ‌ర్య‌పోయారు. సూప‌ర్ హిట్ అయిన ఈ కార్య‌క్ర‌మం వైసీపీలో జోష్ నింపింది.

ఆ ఉత్సాహంతో వైసీపీ మ‌రో పోరాటానికి శ్రీ‌కారం చుట్టింది. నిరుద్యోగుల ప‌క్షాన వైసీపీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో పోరు బాట ప‌ట్ట‌డానికి అన్ని ర‌కాలుగా స‌మాయ‌త్తం అవుతోంది. ఈ మేర‌కు వైసీపీ యువ‌జ‌న విభాగం భారీ సంఖ్య‌లో నిరుద్యోగుల్ని, యువ‌త‌ను స‌మీక‌రించేందుకు చురుగ్గా ప‌ని చేస్తోంది.

ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామ‌న్న హామీకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే నిరుద్యోగుల‌కు ప్ర‌తి నెలా రూ.3 వేలు ఇస్తామ‌న్న హామీ కూడా అమ‌లుకు నోచుకోలేద‌ని వైసీపీ మండిప‌డుతోంది. యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు, హామీ మేర‌కు నిరుద్యోగ భృతి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌రేట్ల ఎదుట వైసీపీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నాలు నిర్వ‌హించ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మాన్ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వివిధ స్థాయిల్లోని వైసీపీ యువ‌జన నాయ‌కుల‌తో పార్టీ పెద్ద‌లు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వయం చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని దిశానిర్దేశం చేశారు.