టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వంలో మంత్రిగా అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో నారా లోకేష్ ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా పార్టీలోని యువ నేతలు అంతా వెంట చేరుతున్నారు. నారా లోకేష్ తో ఉన్న యువ నేతలలో సీనియర్ల వారసులు కూడా కనిపిస్తున్నారు. నారా లోకేష్ టీడీపీకి భావి వారసుడు అన్నది అందరికీ విధితమే.
వచ్చే ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో ఇప్పటి నుంచే చినబాబుని ప్రసన్నం చేసుకుంటే బెటర్ అన్న ముందు చూపుతో చాలా మంది నాయకులు తమ కుమార రత్నాలను లోకేష్ పర్యటనలో కనిపించేలా చేస్తున్నారు. అలాగే పార్టీ ఫ్లెక్సీలు బ్యానర్లలో లోకేష్ పక్కన తమ వారసులు ఉండేలా చేసుకుని చూసుకుని మురిసిపోతున్నారు.
సీనియర్లకు ఎలాగూ రాజకీయ విరామం ప్రకటిస్తారు అని ప్రచారం సాగుతున్న క్రమంలో తమ ప్రాంతాలలో జెండా పెట్టేది తమ వారసులే అని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో లోకేష్ విశాఖ పర్యటన చేస్తే చాలు వారసులే వచ్చి వాలిపోతున్నారు.
అలా వచ్చిన వారిని కాదనకుండా లోకేష్ సైతం వారితో ఫోటలు తీయించుకుంటూ వారిని గౌరవంగా పలకరిస్తూ ఆదరిస్తున్నారు. అయితే దీనితోనే అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఎన్నికల్లో టికెట్లు రావాలంటే టీడీపీ కి ఉన్న పటిష్టమైన యంత్రాంగం ద్వారా సానుకూల మద్దతు దక్కాలని అలాగే సర్వేలు అభిప్రాయ సేకరణలో ముందు వరసలో ఉంటేనే టికెట్లు దక్కుతాయని అంటున్నారు.
అందువల్ల లోకేష్ తో కరచాలనం చేస్తే చాలని భావించే షార్ట్ కట్ పాలిటిక్స్ ని చినబాబు సైతం అలా చూస్తూ ఊరుకుంటారా అని పార్టీలోనే తర్కించుకుంటున్నారు. విశాఖకు తాజాగా ఒకేసారి తండ్రీ కొడుకులు పర్యటనకు వస్తే చంద్రబాబు చుట్టూ సీనియర్లు, లోకేష్ చుట్టూ జూనియర్లు చేరడం రాజకీయంగా చర్చగా మారింది.
