పల్నాడు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి, వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందాడని, ఇందుకు మాజీ ముఖ్యమంత్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయడం న్యాయస్థానం మెట్లు ఎక్కింది. కేసు కొట్టి వేయాలంటూ వైఎస్ జగన్తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్, వైవీ సుబ్బారెడ్డి, విడదల రజిని తదితరులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తమపై కేసు కొట్టి వేయాలని వీళ్లంతా వేర్వేరు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారని పోలీసుల్ని న్యాయస్థానం నిలదీసింది. ప్రమాదానికి ప్రయాణికుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారని కోర్టు ప్రశ్నించడం గమనార్హం.
ఇదే సందర్భంలో హైకోర్టు కీలక ప్రశ్న సంధించింది. జాగ్రత్తలన్నీ తీసుకున్నా, కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించి. కేసు విచారణను జూలై ఒకటో తేదీకి వాయిదా వేశారు.
ప్రయాణికులపై కేసు ఎలా నమోదు చేస్తారని కొన్నిరోజులుగా వైసీపీ నేతలతో పాటు న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నారనే కారణంతో పార్టీ ముఖ్యులపై కేసు నమోదు చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇకపై బస్సు ప్రమాదానికి గురైతే, ప్రయాణికులపై కూడా కేసు పెడతారంటూ ప్రభుత్వ తీరును నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
