దేవినేనికి జ‌గ‌నే గ‌తా?

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ ప్ర‌చారాన్ని దేవినేని ఉమా ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దేవినేని ఉమా క‌రుడుగ‌ట్టిన టీడీపీ నాయ‌కుడు. అలాంటి వ్య‌క్తి ప‌క్క చూపు చూస్తున్నార‌నే ప్ర‌చారం టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో దేవినేనికి మైల‌వ‌రం టికెట్ ఇవ్వ‌లేదు. మైల‌వ‌రం సిటింగ్ ఎమ్మెల్యే , నాటి వైసీపీ నాయ‌కుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ టీడీపీలో చేర‌డాన్ని అప్ప‌ట్లో దేవినేని తీవ్రంగా వ్య‌తిరేకించారు. వైసీపీ అధికారంలో వుండ‌గా దేవినేని, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ మ‌ధ్య వ్య‌క్త‌గ‌త విమ‌ర్శ‌లు తీవ్రంగా సాగాయి. 2019లో మంత్రి అయిన దేవినేనిపై వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ గెలుపొంది, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

వైసీపీలో జోగి ర‌మేశ్‌, వసంత కృష్ణ‌ప్ర‌సాద్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగింది. చివ‌రికి అదే వైసీపీ నుంచి బ‌య‌టికి వ‌చ్చేలా చేసింది. వ‌సంత రాక‌ను దేవినేని తీవ్రంగా వ్య‌తిరేకించినా, చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ వైపే చంద్ర‌బాబు మొగ్గు చూప‌డాన్ని, దేవినేని తీవ్రంగా వ్య‌తిరేకించి అల‌క‌బూనారు. చంద్ర‌బాబు పిలిపించి, బుజ్జ‌గించ‌డంతో దేవినేని సర్దుకున్నారు.

కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చినా ఎలాంటి ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తార‌ని అంతా అనుకున్నారు. అబ్బే, దేవినేనికి అంత సీన్ లేద‌ని టీడీపీ అధిష్టానం త‌న చ‌ర్య‌ల ద్వారా సంకేతాలు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో దేవినేని ఉమా వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మైల‌వ‌రంలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం అవ‌స‌రం. అందుకే దేవినేనికి టికెట్ ఇస్తార‌నే హామీతో ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుంటార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం వుండ‌గా, దేవినేనిపై ఇలాంటి ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఈ ప్ర‌చారాన్ని ఖండించ‌క‌పోవ‌డం ద్వారా, దేవినేని ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్నారో మ‌రి!